Home AP వాటర్‌ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అనంత

వాటర్‌ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అనంత

9
0

AP 39TV 04మే 2021:

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం 33వ డివిజన్‌ నాయక్‌ నగర్‌లో ఉన్న 49వ సచివాలయం వద్ద వైఎస్‌ఆర్‌ తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యేతోపాటు మేయర్‌ వసీం,  కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ.. ప్రభుత్వం గడిచిన 23 నెలలుగా సంక్షేమ పాలనను అందిస్తోందన్నారు. ఇటీవల తాను నాయక్‌నగర్‌లోని సచివాలయం వద్ద ఉద్యోగులు, వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన సందర్భంలో.. నిరుపయోగంగా ఉన్న వాటర్‌ప్లాంట్‌ గురించి కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ తన దృష్టికి తెచ్చినట్లు గుర్తు చేశారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వాటర్‌ప్లాంట్‌ను ఉపయోగంలోకి తీసుకువచ్చామని చెప్పారు. పేదలకు శుద్ధి నీటిని ఇవ్వడమే లక్ష్యంగా ప్లాంట్‌ ఉపయోగంలోకి తెచ్చామని, రూ.2లకే బిందె తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌ ఎక్కువగా ఉందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా బయటకు తిరగరాదని సూచించారు. ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుందని, 2 వారాల పాటు ఈ కర్ఫ్యూ కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. గత ఏడాది కన్నా.. ఈ ఏడాదిలో కరోనా మహమ్మారి లక్షణాలు బయట పడకుండా వ్యాప్తి చెందుతోందని, అందువల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే సమీపంలోని సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య సిబ్బందితో సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కరోనాకు ధైర్యంగా ఉండటమే మందు అని, ఎవరూ ఆత్మస్థైర్యాన్ని వీడద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్‌ అందిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా ఉచిత రేషన్‌తోపాటు రూ.1000 ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించినట్లు గుర్తు చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. స్థానికంగా ప్రజలకు మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో వాటర్‌ప్లాంట్‌ అందుబాటులోకి తీసుకురావడానికి కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ కృషి అభినందనీయమన్నారు. వాటర్‌ప్లాంట్‌ ప్రారంభం అనంతరం డివిజన్‌లో పార్కు ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని ఎమ్మెల్యే అనంత పరిశీలించారు. డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి, కార్పొరేటర్లు రహంతుల్లా, అనిల్ కుమార్ రెడ్డి, డీఈ బాలసుబ్రమణ్యం, 48, 49 సచివాలయాల సిబ్బంది, వైఎస్సార్సీపీ నేతలు బంగారు శీనా, అంజలి, నగేష్, శోభ, ఉష, సురేంద్ర, అంజి, ఆనంద్, వాలంటీర్లు పాల్గొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here